జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ తప్పనిసరి. ఈ మంచి లక్షణాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించండి! ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వీటిని అలవాటు చేసేందుకు ఏం చేశాడంటే..!
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలని సంకల్పించారో ప్రధానోపాధ్యాయుడు. చదువుకోవాల్సిన ఆవశ్యకతను వారికి తెలియజేయాలని అనుకున్నారు. జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమనేది ఆ పిల్లలకు నేర్పించాలనుకున్నారు. ఇందుకోసం అక్షర దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ దీక్షకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించి ప్రతి విద్యార్థి వాటిని పాటించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ 41 రోజుల పాటు నిష్టగా దీక్ష చేయాలని రూల్స్‌ను విధించారు. దీంతో ఆ స్కూల్లోని విద్యార్థుల ప్రవర్తనలో క్రమంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదంతా వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిగిళ్ల ఉన్నత పాఠశాలలో 168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ స్టూడెంట్స్‌ను సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ గౌడ్ ఈ దీక్షను ప్రారంభించారు. దీక్ష గురించి పిల్లల పేరెంట్స్‌కు వివరించారు. సమాజంలో ఇష్టదైవాల పేరుతో దీక్షలు చేపట్టడం మామూలేనని.. కాబట్టి చదువు కోసం చేపడుతున్న ఈ దీక్ష నియమాలను ఆచరించడం ఎంత ముఖ్యమో వారితో చర్చించారు. దీంతో పిల్లలు దీక్ష చేపట్టి నిజాయితీగా, క్రమశిక్షణగా ఉంటూ, సమయపాలన పాటిస్తూ అందర్నీ గౌరవించడం వంటి నియమాలను ఆచరించారు. మరి.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ అక్షర దీక్షపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.