తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే వేగవంతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఓ చిన్నారి బలైపోయింది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. చెట్ల కింద ఉండవద్దని రైతులకు, గొర్రెల కాపరులకు, కూలీలకు సూచించింది. ఇక హైదరాబాద్ లోని పటాన్ చెరువు, గచ్చిబౌలి, లింగంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, మల్లేపల్లి, ఆసిఫ్ నగర్, కార్వాన్ ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. రెండు గంటల వ్యవధిలో 8 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షాలు కురిశాయి.
వేగంగా వీచిన ఈదురు గాలుల కారణంగా హైదరాబాద్ లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగులు విరిగిపడ్డాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా ఓ చిన్నారి మృతి చెందింది. బోరబండ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఎస్పీఆర్ హిల్స్ ఓంనగర్ లో ఓ ఇంటి గూడ కూలడంతో 8 నెలల చిన్నారి మృతి చెందింది. నారాయణఖేడ్ కి చెందిన శ్రీకాంత్, జగదేవిలు నగరానికి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రహమత్ నగర్ లోని ఓంనగర్ లోని రేకుల షెడ్డులో ఉంటున్నారు. వీరికి 8 నెలల పాప జీవనికా ఉంది. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా వీరి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 4వ అంతస్తు గోడ కూలిపోయింది.
గోడ ఇటుక రాళ్లు పక్కనే ఉంటున్న శ్రీకాంత్ రేకుల షెడ్డుపై పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో భార్యాభర్తలిద్దరూ పరుగుపరుగున బయటకు వచ్చి చూశారు. అయితే అప్పటికే గదిలోపల ఊయలలో నిద్రిస్తున్న పాప మీద ఇటుక రాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఆ బిల్డింగ్ నిర్మాణం అక్రమంగా జరుగుతుందని పాప తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు.