ప్రధాని మోడీ నరేంద్ర పర్యటనకు రెండు రోజుల ముందు తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రోజు మోదీ పర్యటనకు గైర్హాజరైన సీఎం కేసీఆర్ పై సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ప్రధాని మోడీ నరేంద్ర పర్యటనకు రెండు రోజుల ముందు తెలంగాణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో నిందితుడిగా పేర్కొంటూ బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ప్రధాని మోదీ శనివారం తెలంగాణలో పర్యటించారు. తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలును పచ్చా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసగించారు. అయితే ఈ మొత్తం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు అయ్యారు.
సీఎం కేసీఆర్ గైర్హాజరుపై బీజేపీ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏంటని, నేటి సీఎం షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కోసం చాలా సేపు ఎదురు చూశానన్న సంజయ్.. ఆయనను సన్మానించేందుకు శాలువ కూడా తీసుకువచ్చానని సెటైర్లు వేశారు. దేశ ప్రధాని రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని అడిగారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించటం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
‘తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్రం అభివృద్ధికి సహకరించడం లేదని నిత్యం ఆరోపించే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధిని కేసీఆర్ కోరుకోవడం లేదు. దేశ ప్రధానికి రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదు. కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా మారాడు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదు’ అని ఆరోపించారు. మోదీ సభకు కేసీఆర్ రాకపోతే.. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాడంటూ శుక్రవారమే సంజయ్ కామెంట్లు చేశారు. ప్రధాని సభకు కేసీఆర్ వస్తే మాత్రం ఆయనతో సన్మానం చేయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన రాకపోవడంతో ఇలా వ్యాఖ్యానించారు.