'సిగ్నల్ రావడం లేదని గ్రామస్థుల ధర్నా..' వినడానికి వింత ఉన్నా ఇది నిజమే. పోనీ ఇది ఎక్కడో జరిగింది అనుకోకండి. జరిగింది.. మన తెలంగాణ రాష్ట్రంలోనే.
టెలికాం ఇండస్ట్రీలో ‘రిలయన్స్ జియో‘ రాక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందన్న విషయం అందరికీ విదితమే. జియో రాక మునుపు కాల్ మాట్లాడాలంటే నిమిషానికి రూపాయి చెల్లించాల్సి వచ్చేది. ఆ భారాన్ని మోయలేక సామాన్య ప్రజలు అరకొరగా సంభాషణలు జరిపేవారు. అదే జియో వచ్చాక తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్ ప్రయోజనాలు అందుతున్నాయి. గంటల తరబడి మాట్లాడుకున్నా నెల మొత్తానికి ఒకటే రీఛార్జ్. అంతేకాదు దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇన్ని ప్రయోజనాలు అందుతున్నప్పుడు, జియో సిగ్నల్ లేకపోవడం ప్రజలకు లోటే కదా! అందుకే రాష్ట్రంలోని ఓ గ్రామ ప్రజలు జియో సిగ్నల్ కల్పించాలని ధర్నాకు దిగారు. ఆ వివరాలు..
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో గతవారం రోజులుగా జియో సిగ్నల్ రావడం లేదట. ఈ విషయాన్ని జియో సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదట. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అంతరాష్ట్ర రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సిగ్నల్ లేకపోవడంతో కాల్స్ మాట్లాడడంలో, ఇంటర్నెట్ వినియోగించడంలో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సిగ్నల్ పునరుద్ధరణకై అధికారులకు, సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామస్థులు రోడ్డుపై ధర్నా చేయడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు.
సిగ్నల్ కోసం ధర్నా చేయడం నవ్వొచ్చే సంఘటనే అయినా, ఆ గ్రామస్థుల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అలా అని ఈ సమస్య ఆ ఒక్క గ్రామానికే కాదు.. నగరంలో కూడా పలు చోట్ల అలాంటి పరిస్థితే ఉంది. సిగ్నల్ అందక మరో నెట్ వర్క్ కు మారిపోయేవారు కొందరైతే, ప్రత్యామ్నాయంగా మరో సిమ్ వాడేవారు మరికొందరు. కాకుంటే సిగ్నల్ కోసం కాకుండా గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇలా స్పందిస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సిగ్నల్ రావడం లేదని రోడ్డుపై ధర్నా చేయడం సరైన ఇర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.