మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? ‘మా’ ఎన్నికల కోసం కూడా మొహాలు కూడా మాడిపోయేలా కొట్టుకునే ఈరోజుల్లో దెయ్యాలు ఎలా ఉంటాయి అంటారా? కానీ.., ఈ కాలంలో కూడా కొంతమందిని దెయ్యం అనే భయం వదలడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఇటీవలి కాలంలో పాటిమీదిగూడెంలో వరుస మరణాలు సంభవించాయి. మొత్తం 8 మంది మగవారు.. ఒకరి తరువాత మరొకరు చనిపోయారు. ఊరు అన్నాక చావు కామనే కదా అంటారా? వీరంతా చనిపోయింది ఏ ఆరోగ్యం బాగాలేకనో, ఏ ప్రమాదం సంభవించొ కాదు. అంతా సూసైడ్ చేసుకుని!
ఎలాంటి బాధలు, ఇబ్బందులు లేకుండానే వారంతా సూసైడ్ చేసుకున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు! మరి.. వీరంతా ఒకేలా ఎందుకు సూసైడ్ చేసుకున్నట్టు? వరుసగా ఎందుకు చనిపోయినట్టు? గ్రామస్థులందరికీ ఈ ప్రశ్నలు నిద్ర పట్టనివ్వలేదు. అంతా కలసి గూడూరులోని ఓ భూత వైద్యున్ని సంప్రదించారు.
పూజలు చేసిన అతను ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకరోజు జనమంతా గూడేనికి దూరంగా ఉండాలని చెప్పాడు. దీంతో.. భూత వైద్యుడు చెప్పినట్టుగా ప్రజలంతా తమ ఇల్లులు ఖాళీ చేసి, సూర్యాస్తమయం అయ్యే వరకు ఊరి బయటే ఉండిపోయారు. గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి చెట్ల కింద గుడారాలు వేసుకుని, అక్కడే వంటావార్పు చేసుకున్నారు.
ఈ విషయం చివరికి అధికారులకి తెలియడంతో అంతా అవాక్కయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ప్రస్తుతం జనంలో చైతన్యం తెచ్చే పనుల్లో పడ్డారు. ఆ చనిపోయిన వారి మరణాలకు గల కారణాలను కూడా కనుక్కోమని పోలీసులను ఆదేశించారు. దెయ్యాలు లేవని, భయపడవద్దని అందరికీ దైర్యం చెప్తున్నారు. మరి.. దెయ్యం ఉందని ఊరిని ఖాళీ చేసిన ఈ గ్రామస్థుల అమాయకత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.