జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలియదు.. పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేసిందో తెలియదు. అసలు ఆమెకంటూ ఏ రోజైనా బతికిందో లేదో కూడా తెలియదు. పిల్లల కోసం అహర్నిశలు శ్రమించింది. వారు జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఆర్థికంగా గొప్పగా లేకపోవడంతో.. వృద్ధాప్యంలో కూడా పిల్లలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఒంటరిగా జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తోనే కాలం వెళ్లదీస్తోంది.
కానీ ఆ కాస్త కూడా తనకు ఇవ్వాలంటూ మనవడు వేధించసాగాడు. అతగాడికి భయపడి.. పెన్షన్ డబ్బుల్లో కొంచెం తీసుకుని మొత్తం మనవడికే ఇచ్చింది. డబ్బులు మొత్తం ఇవ్వలేదని ఆగ్రహంతో.. పండు ముసలి అని కూడా చూడకుండా.. కాళ్లతో తంతూ.. ఆమె కాళ్లని తొక్కుతూ.. అత్యంత రాక్షసంగా దాడి చేశాడు మనవడు. ఆ వృద్ధురాలి ఆర్తనాదాలు వింటే గుండెల్లో కలుక్కుమంటుంది. ఆ వివరాలు..
ఈ హృదయవిదారక సంఘటన వికారాబాద్ జిల్లా, మంబాపూర్‌లో చోటు చేసుకుంది. చిందు యశోదమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ మీదనే ఆధారపడి బతుకుతుంది. కానీ మద్యానికి బానిసయిన మనవడు.. మందు తాగడం కోసం తనకు ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అతగాడికి భయపడిన యశోదమ్మ.. కొంచెం మొత్తం తన దగ్గర ఉంచుకుని.. మిగతా డబ్బు మనవడికి ఇచ్చింది. మొత్తం డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించిన యశోదమ్మ మనవడు.. వృద్ధురాలనే జాలి, దయ ఏమాత్రం లేకుండా.. ఆమెపై దాడి చేశాడు.
కాళ్లతో తంతూ కింద పడేశాడు. అంతటితో ఆగక ఆమె కాళ్లని తొక్కాడు. నానా భూతులు తిడుతూ.. యశోదమ్మపై అత్యంత పాశవీకంగా దాడి చేశాడు. పక్కనే ఉన్న కర్రలాంటిది తెచ్చి కొట్టే ప్రయత్నం చేశాడు. స్థానికంగా ఉన్న వారు అతడికి భయపడి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అనంతరం యశోదమ్మ మనవడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.