గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం బీభత్సంగా కొనసాగుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలతో షాకిచ్చిందని విమర్శించారు.
కేసీఆర్ సర్కారుకు పోయేకాలం దగ్గరపడిందని, అందుకే ప్రజలపై కరెంటు చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి దగ్గర రోజులు పడ్డాయని.. ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని అన్నారు. ఈ ప్రభుత్వం డిస్కమ్ లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని విజయశాంతి ఆరోపించారు. తాజాగా కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ నేడు అన్ని జిల్లాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం తన శాఖలు వాడుకున్న విద్యుత్ కు బిల్లులు చెల్లించడంలేదని, మరోవైపు పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్ము చూపించడంలేదని విమర్శించారు.