ఆమె ఓ గ్రామ సర్పంచ్.. అది పేరుకు మాత్రమే.. ఊరి పెద్ద అయిన ఆమె ఎక్కడి లేని కష్టాలు అనుభవిస్తోంది. ఊరి బాగుకోసం అప్పులు చేసి అల్లాడిపోతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీ పనులకు వెళుతోంది.
సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు. గ్రామానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించడంలో మొదటి ప్రాధాన్యత సర్పంచ్ కే ఉంటుంది. అటువంటి పదవిలో ఉన్న ఉప్పమ్మ కథ వింటే కన్నీళ్లు ఆగవు. ఇంతటి ధీన స్థితి ఆమెకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. వెంకంపాడు గ్రామం ప్రత్యేక తెలంగాణ తర్వాత కొత్త జీపీగా ఏర్పాటయింది. రిజర్వేషన్ కారణంగా తప్పెట్ల ఉప్పమ్మ 20019 జనవరి 25న సర్పంచ్ గా ఎన్నికైంది. దీంతో గ్రామానికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఆమె ఎంతగానో మురిసిపోయింది. ఆ తర్వాత తెలిసింది. సర్పంచ్ పదవి ముళ్ల కిరీటం అని.
తన కూతురు పెళ్లికని కూడబెట్టిన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేసింది. అవికూడా సరిపోక లక్షల్లో అప్పులు చేసింది. వడ్డీలకు అప్పులు తేవడంతో ఆర్థికంగా భారమైపోయింది. గత మూడేళ్లుగా వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధికి సరిపోక మరిన్ని అప్పులు చేయక తప్పలేదు. ఏడాదిగా అసలు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయానని ఉప్పమ్మ కన్నీళ్ల పర్యంతమైంది. సర్పంచ్ కు దక్కవలసిన గౌరవ వేతనం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తపరిచింది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇస్తారన్న ఆశతో తనకున్న ఇంటిని కూల్చేసి రేకుల షెడ్డు వేసుకున్నామని ఆవేదన చెందారు.
పెళ్లీడుకొచ్చిన తన కూతురు పెళ్లి చేద్దామంటే చేతిలో పైసాలేదని, ఉండడానికి ఇల్లు లేదని అన్నారు. రోజు గడవడానికి కూడా కష్టంగా మారిందని సర్పంచ్ ఉప్పమ్మ బోరున విలపించారు. ప్రస్తుతం తాను రోజువారి కూలీగా మిర్చి వేరడానికి వెళుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కష్టాలు ప్రజాప్రతినిధులకు రావడం దురదృష్టకరమని, కష్టాలను గట్టెక్కించే మార్గం చూపాలని ఆమె వేడుకుంటోంది. సీఎం కేసీఆర్ స్పందించి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి అప్పుల బారినుండి తనను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటోంది. మరి, మహిళా సర్పంచ్ తప్పెట్ల ఉప్పమ్మ కన్నీటి గాథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.