ఈ మద్య రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సైతం రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గత నెల హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ వీధి కుక్కల దాడిలో చనిపోయాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వం సైతం ఈ సంఘటనపై సీరియస్ గా స్పందించింది. విధి కుక్కల బెడద తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వీధి కుక్కలు అడ్డు రావడంతో.. ఎమ్మెల్యేకి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి అకస్మాత్తుగా కొన్ని కుక్కలు రావడంతో వాటిని తప్పించే క్రమంలో ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాం దాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. కీసర లో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న సమయంలో కుషాయిగూడ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మరోవైపు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వాహనానికి ప్రమాదం జరిగిన విషయం గురించి వార్తలు రాగానే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం తాను సురక్షితంగా ఉన్నానని… కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవొద్దని అన్నారు. ఈ ప్రమాదంలో ఇరు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.