కొంతమంది యువకులు స్మార్ట్ ఫోన్లను అశ్లీల పనుల కోసం వాడుకుంటున్నారు. అమ్మాయిల ప్రమేయం లేకుండా.. వారి ఫోటోలు ఉంటే మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ప్రొఫైల్ పిక్స్, డీపీలో ఉంటే ఆ ఫోటోలను కొంతమంది కామాంధులు తమ ఫోన్లలో సేవ్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిల ముఖాలను.. కొన్ని అశ్లీల యాప్స్ ఉపయోగించి వేరే నగ్న చిత్రాలకు అతికించి తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ లోని ఓ కాలేజ్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులో ఉన్న ఘట్కేసర్ లోని వీబీఐటీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినుల ఫోటోలను కొందరు యువకులు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. విద్యార్థినుల వాట్సాప్ డీపీ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఎవరి ఫోటోలు అయితే మార్ఫింగ్ చేశారో.. వారికే మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. అర్థరాత్రి పూట షేర్ చేసి.. వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థినులు.. ఆందోళన చేపట్టారు. వీరి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే.. తమతో పాటు తమ కుటుంబం పరువు పోతుందని విద్యార్థినులు, తమ ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కాలేజ్ లో భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థినుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాలేజ్ లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. కాలేజ్ లో ఉన్న విద్యార్థులే ఈ దుస్సాహసానికి పాల్పడ్డారా? లేక ఈ విద్యార్థులే బయటి వారితో చేయించారా? లేక బయట వ్యక్తులే మార్ఫింగ్ కి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేశారు. మార్ఫింగ్ ఫోటోలపై విద్యార్థినులు ఆందోళన చేపట్టడంతో కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.