వేసవి కాలం మొదలైనట్లే కనిపిస్తోంది. గత వారం రోజులుగా నమోదవుతున్న ఎండలను బట్టి సమ్మర్ వచ్చేసిందని చెప్పొచ్చు. సూర్యుడి భగభగలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ కేంద్రం అధికారులు ఏమన్నారంటే..!
ఎండాకాలం వస్తోందంటే చాలు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లాలంటే చాలు ప్రజలు భయపడిపోతారు. ఏదైనా పని ఉంటే పొద్దున లేదా సాయంత్రం పూట పెట్టుకుంటారు గానీ మధ్యాహ్నం మాత్రం బయటికి వెళ్లరు. సన్‌స్ట్రోక్ నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ ఏడాదైనా ఎండలు తగ్గుతాయేమోననని అనుకుంటుంటే.. మార్చి రాకముందే ఎండలు మండుతున్నాయి. సూర్యుడు భగభగమంటున్నాడు. గత వారం రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల 36 నుంచి 38 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలా ఉంటాయోనని తలచుకుని భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందనే దానిపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి స్పందించారు. ఈసారి తీవ్ర ఎండలు తప్పవని ఆమె అన్నారు. మార్చి ఆఖరి వారం నుంచి వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే నాలుగు వారాలకు చూసుకుంటే.. ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని శ్రావణి తెలిపారు. రాబోయే రెండు నెలల్లో వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. చలికాలం నుంచి వేసవిలోకి అడుగుపెడుతుండటం, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో శరీరంలో మార్పులు వస్తాయని ఆమె హెచ్చరించారు. అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.