మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. దాంతో పట్నంలో ఉన్న ఉద్యోగులు సంక్రాంతికి తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. అయితే గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఎండాకాలం ఎండల కంటే ఎక్కువగా మండిపోయేవి. దాంతో మధ్యతరగతి ఉద్యోగులపై తీవ్ర భారం పడేది. ఛార్జీల భారంతో కొంత మంది ప్రయాణాలు వాయిదాలు వేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల టికెట్స్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి ప్రయాణికుల సౌకర్యమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వినూత్నమైన రాయితీలు కల్పిస్తూ.. ఆర్టీసీని అప్పుల నుంచి గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రానున్న సంక్రాంతిని ఆర్టీసీ కి అనుకూలంగా మలుచుకోవాలిన చూస్తున్నారు సంస్థ అధికారులు. అందులో భాగంగానే భారీ ఆఫర్లు ప్రకటించారు. అసలు విషయం ఏంటంటే? సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రానూపోనూ టికెట్లను ఒకేసారి బుకింగ్ చేసుకుంటే.. వారికి తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది అని ప్రకటించింది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A ని సంప్రదించండి.
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) December 26, 2022
ఇక ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమల్లో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మధ్యతరగతి ప్రయాణికులపై భారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ ఆఫర్ డీలక్స్, రాజధాని, గరుడ ప్లస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని RTC యాజమాన్యం పేర్కొంది. ఈ ఆఫర్ ను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని వారు సూచించారు.