ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూడ్డానికి వెళ్లే వారికి టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియంలో ముంబై జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేరుగా చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకోనున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశం నలువైపుల నుంచి రెండు జట్ల ఫ్యాన్స్ హైదరబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి వెళ్లే వారి ప్రయాణం సులువుగా ఉండేందుకు టీఎస్ఆర్‌టీసీ ఓ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ చుట్టు పక్కలి ప్రాంతాలనుంచి స్టేడియానికి వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులను నడుపదల్చుకుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టుపెట్టారు. ఆ పోస్టులో..‘‘ క్రికెట్ అభిమానులారా! ఐపీఎల్ మ్యాచ్‌ని చూసేందుకు ఈ రోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్తున్నారా? మీ కోసమే నగరంలోని వివిధ ప్రదేశాల నుంచి 60 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్‌టీసీ ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ముందు, అనంతరం వాటిని నడపనుంది. ఈ బస్సుల ద్వారా క్షేమంగా సురక్షితంగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి,రండి.
సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తెచ్చుకోవద్దు’’ అని పేర్కొన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతా స్పందించింది. ‘‘ సన్ రైజర్స్ అభిమానుల తరపున వందనాలు సార్ .. క్రికెట్ అభిమానుల కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని పేర్కొంది. మరి, ఐపీఎల్ మ్యాచ్‌లు చూడ్డానికి వెళుతున్న వారికోసం టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
క్రికెట్ అభిమానులారా!? #IPL మ్యాచ్ ని వీక్షించేందుకు ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి మీరు వెళ్తున్నారా!? మీ కోసమే #Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. ఇవాళ జరిగే #SunRisersHyderabad Vs #MumbaiIndians మ్యాచ్ కు ముందు, అనంతరం వాటిని… pic.twitter.com/NtQVejRHDo
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 18, 2023