తెలంగాణ ఆర్టీసీ ఇటీవల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాయశక్తులా కృషి చేస్తుంది. ముఖ్యంగా టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ వినూత్నమైన మార్పులు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా, సంక్రాంతి సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణీకులకు వెసులు బాటు కల్పించారు. కానీ దీని వల్ల రూ. 75 నుంచి రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతో టీఎస్ ఆర్టీసీ మనసు మార్చుకుంది.
ఈ క్రమంలో ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల కోసం హైదరాబాద్ నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఈ రూట్‌లో మాత్రమే అదనపు చార్జీలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆర్టీసీ ఆదాయం పరంగా చూస్తే.. గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో కేవలం రూ.287.07 కోట్లకే పరిమితం అయింది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది.
ఇది చదవండి : ఎంపీ అసద్ పై కాల్పులు.. సీరియస్ గా స్పందించిన కేటీఆర్
గత డిసెంబరు ఆదాయం రూ.352.67 కోట్లతో పోల్చినా జనవరిలో రూ.65.55 కోట్ల మేర తగ్గింది. ఇది ప్రయాణీకులకు మేలైన సౌకర్యం కల్పించడం వల్లనే జరిగిందని.. దీని వల్ల ఆదాయానికి గండి పడుతుందని, ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ఈ నెల 13 నుంచి నడపనున్న ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపైనా నిర్ణయం వెలువడనున్నట్టు తెలుస్తోంది.