టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
టీఎస్పీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భాగంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సభ్యులందరికీ తాజాగా నోటీసులు జారీ చేసింది సిట్. బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేయనుంది. ఈ కేసులో ఒక్కొక్కరినీ సిట్ విచారిస్తూ పోతోంది. అందులో బయటపడుతున్న సమాచారం ఆధారంగా మరికొంత మందిని ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఎంతో కాన్ఫిడెన్షియల్‌గా ఉండాల్సిన ప్రశ్నపత్రం అంత సులువుగా ఎలా లీకైంది? పేపర్ లీకైనా అధికారులు ఏం చేస్తున్నట్లు? ప్రశ్నపత్రం గోప్యత విషయంలో తీసుకున్న చర్యలు ఏంటి? అనే అంశాల గురించి కమిషన్ సభ్యులను సిట్ ప్రశ్నించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటికే నిందితుల సంఖ్య 15కు చేరింది. తీగ లాగితే డొంక కదిలిన మాదిరిగా తవ్వుతున్న కొద్దీ ఈ కేసులో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే విధంగా నిందితుల సంఖ్య కూడా పెరుగుతోంది. కమిషన్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద అధికారులకు నిఘా లేదని సిట్ గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కమిషన్ ఛైర్మన్ సహా సభ్యులందరికీ సిట్ నోటీసులు ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్తో వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబడతారనేది ఆసక్తికరంగా మారింది. విచారణ కోసం కమిషన్ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రోజు కేటాయించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఈ కేసులో కమిషన్ సభ్యుల విచారణతో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.