మీరు టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసే ఉద్యోగాలకు అప్లై చేశారా..? అయితే ఈ కథనం మీకోసమే. వాయిదా పడ్డ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది..రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. కావున ఆ డేట్లు తెలుసుకొని.. అందుకు తగ్గట్టుగా సన్నద్ధత కావాలని మనవి.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం తెలంగాణాలో ఎంతటి వివాదానికి దారితీసిందో అందరికీ విదితమే. ఇంకా ఈ వివాదం సద్దుమణగా లేదు. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చాక కథ మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఇదిలావుంటే టీఎస్‌పీఎస్‌సీ.. వాయిదా పడ్డ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. ఆ వివరాలు.. మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్ భర్తీకి రాతపరీక్ష నిర్వహించనుండగా.. మే 19న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే జులై 18, 19వ తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టులకు, జులై 20న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
కాగా, ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ను ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. నిందితులను ఈ నెల 17, 18న చంచల్‌గూడ జైలులో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక కస్టడీలోని నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయి లౌకిక్, సుష్మిత అను మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సుష్మిత కోసం రూ.6 లక్షలు పెట్టి.. ప్రవీణ్ నుంచి డీఏఓ పరీక్షపేపర్‌ను సాయి లౌకిక్ కొనుగోలు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 17కు చేరింది.