ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి.. ఎంతో ఖర్చు చేసి.. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అంత శ్రమించినా ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. కానీ కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో పేపర్లు లీక్ చేస్తూ.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర ఉద్రిక్తతలు రాజేస్తోంది. ఆ వివరాలు..
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టౌన్ ప్లానింగ్ విభాగం పోస్టుల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయని అనుమానించి విచారణ జరిపితే.. మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైనట్లు తేలింది. మునిసిపల్ పరిపాలన విభాగంలో ఖాళీగా ఉన్న 837 అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం మార్చి 5న పరీక్ష నిర్వహించారు. సుమారు 55 వేల మంది ఎగ్జామ్ రాశారు. ఇక ఈ పరీక్ష ప్రశ్నపత్రాలే లీకైనట్లు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఏఈ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గ్రూప్ 1 ప్రిలీమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీకయ్యిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏగా ఉన్న ప్రవీణ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాశాడు. 103 మార్కులు వచ్చాయి కానీ రాంగ్ బబ్లింగ్ వల్ల క్వాలిఫై కాలేదు. ఈ క్రమంలో గ్రూప్-1 పేపర్ కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది.. ప్రవీణ్ ఎవరు.. రేణుకతో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది అంటే..
ఏపీలోని రాజమండ్రికి చెందిన పి. హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్ కుమార్. హరిశ్చంద్ర రావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయంలో ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పని చేశాడు. అనారోగ్య కారణాల వల్ల ఆయన విధులు నిర్వహిస్తుండగానే మరణించడంతో.. కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. ప్రవీణ్ బీటెక్ పూర్తి చేశాడు. తొలుత జూనియర్ అసిస్టెంట్‌గా చేరి.. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి పీఏగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రవీణ్‌కు నిందితురాలితో పరిచయం ఎలా ఏర్పడింది.. ఆమె వివరాలు..
మహబూబ్‌నగర్‌కు చెందిన రేణుక.. 2018లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యి.. గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె వనపర్తిలో విధులు నిర్వహిస్తోంది. రేణుక భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లో డీఆర్‌డీఏలో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఉద్యోగంలో చేరే సమయంలో రేణుక టీఎస్‌పీఎస్సీ బోర్దు దగ్గరకు పలు మార్లు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఆమె అనేక సార్లు ప్రవీణ్‌ను కలవడం కోసం టీఎస్‌పీఎస్సీ బోర్డు దగ్గరకు వచ్చింది.
ఈ క్రమంలో రేణుక సోదరుడు రాజేశ్వర్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఎలాగైనా తన తమ్ముడు ఉద్యోగం పొందాలని భావించిన రేణుక, తన భర్తతో దీని గురించి చర్చించింది. ఈ క్రమంలో వారికి ప్రవీఫ్ గుర్తుకు వచ్చాడు. అతడి సాయం తీసుకోవాలని భావించిన రేణుక.. ప్రవీణ్‌ను సంప్రదించిన ఈనెల 5న జరిగే ఏఈ (సివిల్) ఎగ్జామ్ పేపర్‌ను తనకు అందించాలని కోరింది. అందుకు గాను రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుంది. పేపర్ లీక్ చేయడానికి అంగీకరించిన ప్రవీణ్.. ఆ ప్రయత్నాలు ప్రారంభించాడు.
పబ్లిక్ పరీక్షల సమాచారం, ప్రశ్నపత్రాలు టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ఉంటాయి. అక్కడికి వెళ్లడానికి ఎవరికీ యాక్సెస్ ఉండదు. కానీ ప్రవీణ్ టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ కావడంతో.. అన్ని సెక్షన్‌లకు వెళ్లే అవకాశం, అనుమతి ఉంది. దాన్ని వాడుకోవాలని భావించాడు ప్రవీణ్. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీలో ఔట్‌సోర్సింగ్‌లో నెట్‌వర్క్ అడ్మిన్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజు సహకారం తీసుకున్నాడు.
టీఎస్‌పీఎస్సీ సెక్రటరీగా ప్రవీణ్‌కు అన్ని సెక్షన్‌లకు వెళ్లే అవకాశం ఉండటంతో.. దాన్ని అడ్డుపెట్టుకుని.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని ఓ అధికారి నోట్‌బుక్‌లో నుంచి ప్రశ్నపత్రాలు భద్రపరిచిన సిస్టమ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ దొంగిలించిన ప్రవీణ్.. వాటిని రాజశేఖర్‌కు ఇచ్చాడు. వాటి సాయంతో రాజశేఖర్.. సదరు ఉద్యోగి సిస్టమ్ నుంచి ఏఈ (సివిల్) పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసుకుని తీసుకువచ్చి ప్రవీణ్‌కు అందించాడు. ఈ నెల 2న ప్రవీణ్ వాటిని రేణుకుకు ఇచ్చాడు. ప్రశ్నపత్రం ఇవ్వడంతో రేణుక ముందుగా ప్రవీణ్‌కు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇక మిగిలిన మొత్తాన్ని ఒకటి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పింది.
ప్రవీణ్ ద్వారా ప్రశ్నపత్రాలను సాధించిన రేణుక.. వాటిని ప్రింట్ తీసుకుని.. వెళ్లి.. తమ్ముడితో కలిసి.. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకున్నారు. ఆమె అక్కడితో ఆగిపోయి ఉంటే అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చేదే కాదు. కానీ రేణుక అత్యాశ కారణంగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నాపత్రాలు చేతికి చిక్కాక.. రేణుకకు ఓ దుర్బుద్ధి పుట్టింది. తమ్ముడి కోసం లీక్ చేయించిన పరీక్ష పత్రాలను.. ఏఈ ఆశావహ అభ్యర్థులకు అమ్మి డబ్బు సంపాదించాలని భావించింది. భర్త, తమ్ముడికి దీని గురించి చెప్పింది. వారు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తమ బంధువు శ్రీనివాస్‌కు.. ఏఈ పరీక్ష పత్రం లీకేజీ గురించి చెప్పారు. ఎవరైనా అభ్యర్థులు ఉంటే చెప్పాలని అడిగారు.
దాంతో శ్రీనివాస్.. తన ఇద్దరు స్నేహితులు నీలేశ్‌నాయక్, గోపాల్ నాయక్ ఏఈ సివిల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారని వారి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో దాంతో రేణుక ఆమె భర్త.. ఇద్దరు కలిసి శ్రీనివాస్ స్నేహితులకు ఏపీ ప్రశ్న పత్రాన్ని అమ్మింది. వీరితో పాటు మరో వ్యక్తికి కూడా సుమారు 15 లక్షలకు ప్రశ్న పత్రాన్ని అమ్మి డబ్బు చేసుకున్నారు. విషయం కాస్త లీకవ్వడంతో.. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియమాకాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుద్యోగులు దీనిపై తీవ్రంగా మండి పడుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది.. టీఎస్‌పీఎస్సీదా.. లేక ప్రవీణ్‌దా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Group-1 Govinda?
This is the OMR sheet of praveen, A1 in #Tspsc paper leak.
He got 103 marks
My friend cleared UPSC mains in 2021 got 92.
Which means this paper also leaked!
Thank you for spending more time in #delhiliquorpolicy @KTRBRS @BRSHarish @KTRoffice @HarishRaoOffice pic.twitter.com/16ku4H4Ry1— VPK carpenter (@Vijay96460168) March 14, 2023