ఎస్ఐ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 'టీఎస్‌పిఎల్‌ఆర్‌బి' కీలక ప్రకటన చేసింది. తుది రాత పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలు మూడు జిల్లాల్లో మాత్రమే జరగనున్నాయి. హాల్ టిక్కెట్లు ఎప్పటినుండి డౌన్ లోడ్ చేసుకోవాలి..? పరీక్ష తేదీలు..? వంటి పూర్తి వివరాలు కోసం కింద చదివేయండి.
యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ‘టీఎస్‌పిఎల్‌ఆర్‌బి’ కీలక ప్రకటన చేసింది. ఎస్ఐ రాత పరీక్షల తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఏప్రిల్ 3 నుంచి 6వ తేదీలోగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీఎస్‌పిఎల్‌ఆర్‌బి సూచించింది.
రాష్ట్రంలో 587 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పిఎల్‌ఆర్‌బి నోటిఫికేషన్ వెలువడిన సంగతి అందరకీ విదితమే. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి సంభందించి ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తవగా.. తుది రాత పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ రాత పరీక్షలను ఏప్రిల్ 8, 9వ తేదీలలో నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ పేపర్.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ నిర్వహించనున్నారు.
అలాగే, 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జనరల్ స్టడీస్.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు/ఉర్దు పరీక్ష పేపర్ ఉండనుంది. అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ TSPLRB నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్‌టికెట్లపై అభ్యర్థి ఫొటో అతికించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే support@tslprb.in లేదా 9393711110/9391005006 నెంబర్లను సంప్రదించాలని తెలిపింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో మాత్రమే ఈ ఫైనల్ రాత పరీక్షలు జరుగనున్నాయి.