ఇటీవల తెలంగాణ లో ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాయి గణేష్ పై పోలీసులు వేధింపులు దారుణంగా మారాయని.. ఇది భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాయి గణేష్ ఆత్మహత్య విషయం హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో బీజేపీ నేతగా మంచి ఫామ్ లోకి వస్తున్న సాయి గణేష్ పై కక్ష్య కట్టి ఆయనపై లేని పోని కేసులు బనాయించి చిత్ర హింసలకు గురిచేశారని.. ఈ క్రమంలో వేధింపులు తాళలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకునే ముందు ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాయి గణేష్.. పోలీసుల వేధింపులు, మంత్రి పువ్వాడ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సాయి గణేష్ సూసైడ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లుగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అంతే కాదు ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. కోర్టు కొంత సమయం వెచ్చిస్తే.. ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ ధర్మాసనానికి విన్నవించారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.