విద్యార్థులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడం కష్టం అంటున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
కొన్నేళ్ల క్రితం ఎంసెట్‌కి ఇంటర్ మార్కుల వెయిటేజీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు.. దానికి తోడు వారికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం వెయిటేజీ కల్పించేవారు. అంటే విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులకు.. ఇంటర్ మార్కుల వెయిటేజీ కూడా తోడవ్వడం వల్ల విద్యార్థులకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్ మార్కులకు కల్పిస్తోన్న 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు.
ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు… అంటే 600 మార్కులకు గాను 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. అయితే ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని.. ర్యాంక్ కేటాయించనున్నారు అధికారులు. ఇక ఇప్పటికే జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీని తీసివేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎంసెట్ పరీక్షకు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం.. వాటి వివరాలును ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్ ఫలితాల వెల్లడికి ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. ఇక ఇప్పటికే కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్ వెయిటేజీని తొలగించారు. ఈఏడాది దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ… గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం జీఓ నెం 18ను జారీ చేశారు.
తెలంగాణ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) దరఖాస్తు ప్రక్రియ మార్చి 3న ప్రారంభమైంది. విద్యార్థులు ఏప్రిల్ 10 వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ తరవాత అప్లై చేయాలంటే.. ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. రూ.250 – రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల నిర్వహణ వచ్చి ఈ ఏడాది మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మే 7 నుంచి 9 వరకు ఇంజినీరింగ్ విభాగానికి, మే 10 నుంచి 11 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.
ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.