ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన కవిత మరోసారి తిరిగి పోటీ చేశారు. అయితే ఈసారి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు పోటీకి దూరం కావడంతో కల్వకుంట్ల కవిత గెలుపు ఏకగ్రీవం అయింది.
తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ తరుపున ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ.. దానిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఫామ్ 26 లో తప్పులు, బ్యాంకు అకౌంట్ వివరాలు తేడాగా ఉండటంతో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి కాసేపట్లోనే ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.