హూజూరాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. ఎవరి ప్రచారంలో వారు ఉన్నారు. ఈసారి గెలుపు పై ముఖ్య పార్టీలు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హూజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న తరుణంలో ఇప్పుడు అధికార పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్టు సమాచారం. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సింబల్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నిక ఏదైనా ఒకేలా ఉన్న గుర్తులతో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు.
ఒక్కోదశలో గెలుపు అంచాలు పూర్తిగా తారు మారు అవుతున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు ఉప ఎన్నికలోనూ రోడ్ రోలర్, చపాతీ మేకర్, హెలికాఫ్టర్ గుర్తులు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ అభివృద్ది, సంక్షేమ పథకాలతో ప్రజలు మళ్లీ తమ పార్టీని ఆదరిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ.. ఈ గుర్తులు ఎంత మేర డ్యామేజ్ చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు గులాబీ నాయకులు. ఇప్పటి వరకు కారు గుర్తుకు ఎలాంటి పోటీ లేకండా విజయాలు సాధిస్తూ వస్తుంది. కానీ ఇటీవల కాలంలో చిన్నపార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు వివాదాస్పదం అయ్యాయి.
గత ఎన్నికల్లోనూ ఆటో, ట్రక్కు, రోడ్ రోలర్, రోటీ మేకర్ లాంటి సింబల్స్ టీఆర్ఎస్ ఓట్లను గణనీయంగా చీల్చాయి. దీంతో గులాబీ నేతలు.. డమ్మీ ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ట్రక్కు గుర్తు మీద 30 చోట్ల పోటీ చేయగా.. ఆ పార్టీ అభ్యర్థులకు పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయి. అంతే కాదు 2019 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ మరోసారి ఎంపీగా గెలవలేకపోవడానికి గుర్తుల తికమకే కారణమైంది. ఇలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అధికార పార్టీ గట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్య నాయకులను రంగంలోకి దింపి డమ్మీ ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.