వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టటంతో పాటు బస్సుపై రాళ్ల దాడి చేశారు. షర్మిల గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం ఉదయం ప్రజా ప్రస్ధానం పాదయాత్రలో ఉన్న షర్మిలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి గురించి వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని, నన్ను అరెస్ట్ చేయటానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అందుకే పాదయాత్రలో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తోంది.
నా బస్సును కూడా తగులబెట్టారు. పోలీసులు దగ్గరుండి ఈ దాడి చేయించారు. బస్సు అద్దాలు సైతం రాళ్లతో పగులగొట్టారు. కారుతో ఈ దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్ టీపీ కార్యకర్తలపై కూడా దాడి జరిగింది. బస్సుకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ రోజు జరుగుతున్న పాదయాత్రకు అనుమతి ఉంది. కావాలనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేది లేదు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటా. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే తట్టుకోలేక ఈ దాడుల్ని చేస్తున్నారు. ఎన్ని జరిగినా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటా.