భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల బ్యాచ్ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాల మధ్యలో గొడవలు జరగడంతో కిడ్నాప్ లకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
గత కొంతకాలంగా సమాజంలో ఏ కష్టం చేయకుండా లక్షాధికారులు అయిపోవాలన్న వ్యక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. దాంతో సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో హత్యలు చేయడానికి సైతం వారు వెనకాడటం లేదు. ఇక గత కొంత కాలంగా గుప్త నిధుల ముఠాలు పుట్టుగొడుల్లా పుట్టుకొస్తున్నాయి. పురాతన దేవాలయాల్లో తవ్వకాలు చేపడుతూ.. రాత్రులు ఊర్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల బ్యాచ్ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాల మధ్యలో గొడవలు జరగడంతో కిడ్నాప్ లకు దిగిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం. ప్రస్తుతం ఈ ఊరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దానికి ఒకే ఒక్క కారణం గుప్త నిధులు. ముందుగా ఈ గుప్త నిధుల బ్యాచ్ లు ముఠాలుగా విడిపోయి, తవ్వకాలు జరిపే పాయింట్లను గుర్తిస్తారు. పగటి వేళల్లో సాధారణ వ్యక్తుల్లాగే ఉండి.. రాత్రి పలుగులు, పారలు పట్టుకుని తవ్వకాలకు బయలుదేరుతారు. ఇక తాజాగా కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో కొన్ని రోజుల క్రితం నాలుగు పాయింట్లలో గుప్త నిధుల తవ్వకాలు జరిగినట్లు సమాచారం. ఈ తవ్వకాల్లో తొలి పాయింట్ లో దొరికిన నిధిని జాగ్రత్తగా ఉంచమని ముఠాలోని ఓ వ్యక్తి దగ్గర ఉంచారు.
ఇక ఇప్పుడు ఆ వ్యక్తిని నిధి తీసుకురమ్మని అంటే.. తన దగ్గర లేదని, అది మాయం అయ్యిందని, దాంట్లో ఏదో అదృష్ట శక్తి ఉందని అతడు చెప్పాడు. దాంతో అతడిని కిడ్నాప్ చేసి చాతకొండ పరిధిలోని ఓ రహస్య ప్రదేశంలో దాచి, నిధి ఎక్కడ ఉందో చెప్పమని మిగతా ముఠా సభ్యులు తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఇక తన కొడుకు ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. ఇటుక బట్టీల వ్యాపారి అయిన సదరు వ్యక్తి ఆరా తియ్యడంతో.. అసలు విషయం బయటపడింది. దాంతో గుప్త నిధుల ముఠాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో తన కొడుకుకు ప్రాణహాని తలపెట్టవద్దని, నిజం తెలుసుకుని వారిని న్యాయం చేస్తానని అక్కడి నుంచి ఇద్దరు బయటపడ్డట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. మాయం అయిన నిధికి సంబంధించి రూ. 10 నష్టపరిహారం ఇస్తానని ఇటుక బట్టీల వ్యాపారి ఒప్పుకున్నాడు. దాంతో ముఠా సభ్యులు సైతం దానికి అంగీకరించారు.
అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం రూ. 4 లక్షలను ఆ ముఠాకు ముట్టజెప్పాడు. మిగిలిన రూ. 6 లక్షలను ఈ నెల 10న చెల్లిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ముఠాలోని సభ్యులకు గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొట్ల విలువైన నిధిని కాజేసి.. రూ. 10 లక్షలకు రాజీ పడటంపై సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో ఈ విషయం బయటకి పొక్కింది. ఈ ముఠాలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడితో పాటుగా, క్రిమినల్ రికార్డు ఉన్న మరో వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడింతే.. జిల్లా కేంద్రంలో 16 మంది సభ్యులు నాలుగు గ్రూప్ లుగా విడిపోయి.. తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల్లోని ఊర్లలో ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే బయటపడిన ఆ నిధి దాచిపెట్టమని ఇచ్చిన వ్యక్తే కాజేశాడా? లేక అది ఎక్కడికి పోయింది అన్నది ఇక్కడ మిస్టరీగా మారింది. ఇదంతా చీకటి వ్యవహారం కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది అన్నది అక్కడి ఊర్లలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ఈ ముఠాలపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో.. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.