ఎప్పుడో రెండేళ్ల వయసున్న కొడుకుని వదిలిపెట్టి ఉపాధి కోసమని గల్ఫ్ దేశానికి వెళ్తే.. పదేళ్ల తర్వాత కొడుకుని దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకుని ముద్దులు పెట్టుకుందామని అనుకుంటే ఆ తండ్రికి చివరికి కన్నీరే మిగిలింది.
కొడుకు వయసు అప్పుడు రెండేళ్లు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో తెలియని వయసు అది. ఆ వయసులో బాబు తండ్రి ఉపాధి కోసమని సౌదీ అరేబియా వెళ్ళారు. అక్కడే దాదాపు పదేళ్లు ఒంటరిగా ఉన్నాడు. ఫోన్ చేసి పిల్లల బాగోగులు తెలుసుకునేవారు. అయితే రోజూ దగ్గరుండి పిల్లలకు ప్రేమను పంచలేకపోతున్నానని బాధపడేవారు ఆ తండ్రి. పిల్లలు కూడా తండ్రి ప్రేమ కోసం పరితపించిపోయారు. అందరి తండ్రుల్లా తాను కూడా తన పిల్లలను ఎత్తుకుని ఆడించాలని అనుకున్న ఆ తండ్రి ఉపాధి కోసం తప్పక గల్ఫ్ దేశానికి వెళ్ళారు. మొత్తానికి పదేళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. విమానాశ్రయం వద్ద తండ్రికి పిల్లలు స్వాగతం పలికారు.
ఆ సమయంలో పిల్లల్ని చూసి.. ‘అప్పుడే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో’ అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. అలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లారు. ఇక ఈ జీవితం పిల్లలతో గడపడానికే అని అనుకున్న ఆ తండ్రి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. నీళ్ల డబ్బా తీసుకొస్తా అని చెప్పి వెళ్లిన కొడుకు తిరిగి రాలేదు. ద్విచక్ర వాహనంపై వెళ్లిన కొడుకు విగతజీవిగా ఇంటికి తిరిగిరావడంతో ఆ తండ్రి మనసు ముక్కలైపోయింది. ఈ ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాలలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన చౌట్ పల్లి మోహన్, పద్మిని దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు పేరు శివ కార్తీక్ (12). స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి మోహన్ పదేళ్ల క్రితమే సౌదీ అరేబియా వెళ్ళాడు.
సోమవారం ఉదయం ఆయన ఇండియా తిరిగి వచ్చారు. కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం చెప్పారు. మొత్తం అందరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లో మంచి నీరు అయిపోవడంతో తీసుకొస్తా అని చెప్పి శివ కార్తీక్ ద్విచక్రవాహనంపై వెళ్ళాడు. బైపాస్ రోడ్డు మీద దేవిశ్రీ గార్డ్న్ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో డివైడర్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో శివ కార్తీక్ కు తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రెండేళ్ల వయసులో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఇంత దగ్గరగా ఇలా చూస్తానని అనుకోలేదంటూ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.