హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. మెట్రో వచ్చాక కొద్దిగా రద్దీ తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ.. అది వాహనదారులకు ఊరటనివ్వటంలేదు. ఇక పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పడు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అనేది సహజమే. అయితే అది కేవలం 5 రోజులు లేదా 10 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ తాజాగా అంబర్ పేట్ లో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న కారణంగా 40 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి అంటే జనవరి 30 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంబర్ పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టడంతో.. గాంధీ విగ్రహం నుంచి అంబర్ పేట్ టీ జంక్షన్ వరకు జనవరి 30 నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డును మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. రోజు ఈ రూట్ లో వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే గాంధీ విగ్రహం నుంచి 6వ నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే రోడ్డు మార్గంలో(ఒకవైపు) వెహికిల్స్ ను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఉప్పల్ నుంచి 6వ నంబర్ బస్టాప్ మీదుగా చాదర్ ఘాట్ వెళ్లే భారీ వాహనాలతో పాటుగా ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్ రోడ్స్ నుంచి తార్నాక, అడిక్ మెట్ ఫ్లై ఓవర్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, ఫీవర్ ఆసుపత్రి, బర్కత్ పురా, నింబోలి అడ్డా వైపు వాహనాలను మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు. అయితే ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులతో పాటుగా సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్. CCL అంబర్ పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్ రోడ్స్, నెంబర్ 6 బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా ప్రాంతం మీదుగా చాదర్ ఘాట్ కు వెళ్లాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని వాహనదారులు గుర్తుపెట్టుకుని తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే 6వ నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వచ్చే అన్ని వెహికిల్స్ ను అనుమతిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మరి హైదరాబాద్ లో 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.