మెట్రో రైలు వచ్చాక చాలా మంది ఉద్యోగులకు ఉపశమనం లభించింది. ఈ రద్దీలో, ముఖ్యంగా మండుటెండల్లో గంటల తరబడి ట్రాఫిక్ లో ప్రయాణం చేయాలంటే చుక్కలు కనబడతాయి. మెట్రో రైలు పుణ్యమా అని ఆ సమస్య పోయింది. వాహనదారులు తమ బండ్లను మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి మెట్రో ప్రయాణం సాగిస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే తమ ఆఫీసులకు చేరుకుంటున్నారు. అయితే మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసే వారికి ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.
ట్రాఫిక్ లో ఆఫీస్ కి, ఇతర పనుల మీద బయటకు వెళ్ళడానికి ఇబ్బందులు పడకుండా చాలా మంది త్వరగా వెళ్లేందుకు మెట్రో రైలు ప్రయాణాలను సాగిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్ వరకూ తమ సొంత వాహనాల మీద వస్తున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ ఏరియా ఉంటే అక్కడ పార్కింగ్ చేసుకుని మెట్రో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే కొన్ని మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ ప్రదేశం లేక సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో తమ వాహనాలను పార్క్ చేసుకుంటున్నారు. అయితే అలా ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేసేవారికి హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర ఖాళీ స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు.
ఇవాళ ఉదయం నుంచి మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ పరిధిలోని పోలీసులు మెట్రో స్టేషన్ల వద్ద తనిఖీలు చేసి నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసిన వాహనాలకు భారీగా జరిమానా విధిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద భారీగా చలానాలు వేస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మెట్రో రూట్ లో ఎల్బీనగర్, చైతన్యపురి, విక్టోరియా, దిల్ సుఖ్ నగర్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ సదుపాయం లేదు.
దీంతో వాహనదారులు ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేశారని భారీగా చలానాలు వేస్తుండడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పోలీసులు వేసే జరిమానాలు భరించలేకపోతున్నామని, మెట్రో అధికారులు ఇప్పటికైనా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? పార్కింగ్ సదుపాయం కల్పించని మెట్రో అధికారులదా? నో పార్కింగ్ చోట వాహనాలు పార్క్ చేసిన ప్రయాణికులదా? లేక వాహనదారుల ఆవేదన అర్థం చేసుకోని ట్రాఫిక్ పోలీసులదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.