టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పంచాయతీల నిధుల విషయంపై.. సర్పంచ్‌లకు మద్దతుగా.. రేవంత్ రెడ్డి సోమవారం.. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని.. ధర్నాకు అనుమతి లేదని చెప్పి ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం సర్పంచ్‌లకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని.. పోలీసులు ఆయన ఇంటి బయటే అడ్డుకున్నారు. దాంతో.. రేవంత్ రెడ్డి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి.. బయటకు వస్తే అరెస్ట్ చేస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ పోలీసులకు అభ్యంతరం ఉంటే.. వారు ధర్నా చౌక్ వద్దకు వచ్చి తనను అరెస్ట్ చేయాలని సూచించారు. అయినా సరే.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో.. రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని.. అలానే తన ఇంటికొచ్చిన విజయారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ.. రేవంత్ రెడ్డి.. పోలీసులను నిలదీశారు. అంతేకాక.. విజయారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రగతిభవన్ ముందు ధర్నాకు దిగేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలు, శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ప్రసుత్తం వారి గృహనిర్బంధం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం సమంజసమే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.