ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఆ అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఆదివాసీలు, గిరిజనలు నివాసం ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నివాసం ఉండే వారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటారు.
ఆదివాసీల, గిరిజనుల జీవన పరిస్థితిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచం మొత్తం అభివృద్ది చెందుతున్న వారు నివాసం ఉండే ప్రాంతాలు ఆ అదృష్టానికి నోచుకోవు. అభివృద్ధి మాట దేవుడు ఏరుక.. విద్యా, వైద్యం, సరైన రోడ్డు మార్గం వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండవు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులు ఈ కొండ ప్రాంతాల్లో, అడవుల్లో నివాసం ఉండే జనాలు గుర్తుకు వస్తారు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వైద్యం కోసం కొండలు, గుట్టలు, వాగులు దాటుకుని పట్టణానికి చేరుకోవాలి. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే మరణించిన వారు ఎందరో ఉన్నారు. ఎందరో గర్భిణీలు కూడా మార్గం మధ్యలోనే ప్రసవం అయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అర్ధరాత్రి సమయంలో అటవీ ప్రాంతం మధ్యలో ఓ మహిళ ప్రసవం అయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిర్మల్ జిల్లా పెంబి మండలం దొందారి పంచాయతీ పరిధిలోని వనస్పల్లి గ్రామానికి చెందిన సిడాం సరిత.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా అడవికి సమీపంలో ఉంది. దీంతో అక్కడే స్థానికంగా పనులు చేసుకుంటూ సరిత కుటుంబం జీవనం సాగిస్తుంది. గర్భిణీ అయిన సరితకు సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు సరితాను ఆస్పత్రికి తీసుకెళ్లేందు సిద్దమయ్యారు. గ్రామస్థుల సహకారంతో ఎంగ్లాపూర్ వరకు ఎడ్లబండిలో సరితను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆ క్రమంలోనే అర్థరాత్రి అటవీ ప్రాంతం మధ్యలో సరిత ప్రసవం అయ్యింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను అతి కష్టం మీద ఎంగ్లాపూర్ కు తీసుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ లో తల్లీ, బిడ్డను పెంబి పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించారు. దీంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఆదీవాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం బాగుండి.. తల్లీబిడ్డకు ఏమీ కాలేదు కానీ.. ఇంకా ఏదైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏంటనే ఆవేదన వ్యక్తం చేశారు. సరిత నివాసం ఉంటున్న గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలు దోత్తి వాగు అంతల ఉంటాయి.
వాగుకు అటువైపు ఉండే ఆదివాసీలకు కష్టాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆదివాసీలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన రహదారులు లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవుని పై భారం వేసి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సరైన సమయంలో చికిత్స అందక ఆదివాసీల ప్రాంతంలో చాలా మంది మృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ ప్రాంతాన్ని రోడ్డు మార్గం వేయించాలని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.