వివిధ కారణాలతో తరచూ కాలేజీ, పాఠశాల భవనాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలోని ఓ కళాశాల భవనం మెట్ల రెయిలింగ్ కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు..
పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది విద్యా నిలయాలైన కాలేజీలు, పాఠశాలలు. ఇక్కడ విద్యార్థులకు విజ్ఞానంతో పాటు మంచిచెడుల మధ్య ఉండే తారతమ్యాన్ని నేర్పించబడుతుంది. అయితే ఇలాంటి సరస్వతి నిలయాల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. భవనాల పైకప్పులు ఊడిపోవడం, లేదా భవనం పాతబడి కూలిపోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగి ఎందరో అమాయకపు పిల్లలు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా ఓ ప్రైవేటు కాలేజీ భవనం మెట్ల రెయిలింగ్ కూలి.. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా వద్ద భవిత ఇంటర్ కాలేజీ వసతి గృహం ఉంది. ఆదివారం పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని భవిత ఇంటర్ కాలేజీ హస్టల్ నుంచి ఛత్రపతి శివాజీ ర్యాలీ వెళ్తుంది. అయితే ఈ వేడుకను తిలకించేందుకు విద్యార్థులు కాలేజీ భవనం మెట్లు ఎక్కారు. ఆ బిల్డింగ్ పాతది కావడంతో విద్యార్థులు బరువుకు మెట్ల రెయిలింగ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో విద్యార్ధులు మొదటి అంతస్తుపై నుంచి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో పది మంది కళాశాల విద్యార్థులకి గాయలయ్యాయి.
వీరిలో కొందరికి కాలు, చేతులు, తలకకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కాలేజీ సిబ్బంది సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అభినాష్ రెడ్డి అనే విద్యార్థిని హైదరాబాద్ కు తరలించారు. గాయపడిన ఓ విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెట్ల రెయిలింగ్ పటిష్ఠంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఇతర పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.