సమాజంలో జరిగే విచిత్రమైన ఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాము. తండ్రి దొంగ అయితే కొడుకు పోలీసు కావడం. బీటెక్ లో టాపర్ గా ఉన్న యువకుడు.. చైన్ స్నాచింగ్ లకి పాల్పడటం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా మరో విచిత్రమైన వార్త వెలుగులోకి వచ్చింది. కుమారుడు అటవీశాఖలో డిప్యూటీ రేంజి స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తుంటే తండ్రి మరొక ప్రాంతంలో అటవీలోని కలపను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. మెదక్ జిల్లా రామాయం పేట అటవీ ప్రాంత పరిధిలోని అటవీశాఖ అధికారులు దాడులు కొందరు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ అటవీ శాఖ అధికారి తండ్రి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా రామాయం పేట అటవీ రేంజి పరిధిలో కొందరు కలపను స్మగ్లింగ్ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో అధికారులు దాడులకు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు కలపను స్మగ్లింగ్ చేస్తూ అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై రామాయపేట అటవీ రేంజి అధికారి విద్యాసాగర్ పలు విషయాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన గాండ్ల బాలయ్య, నక్కల స్వామి, నక్కని చిన్నస్వామిలు అడవిలో టేకు చెట్లను నరికి తరలిస్తున్నారు. పక్క సమాచారంతో బుధవారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. నిందితులను విచారించగా ధర్మారం గ్రామానికే చెందిన బొడ్డు నర్సింలు ఈ అక్రమ కలప తరలింపు దందాను నడిపిస్తున్నట్లు తేలింది.
అడవిలో దొంగిలించిన 25 కలప దుంగలను వాగులో, పొలాల సమీపంలో దాచి ఉంచగా గురువారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనానికి పాల్పడిన బాలయ్య, స్వామి, చిన్న స్వాములను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన బొడ్డు నర్సింలు కొడుకు వేరొక ప్రాంతంలోని ఫారెస్ట్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నాడు. నర్సింలు కుమారుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ రేంజి అధికారిగా పనిచేస్తున్నట్లు గ్రామస్థుల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించలేదు.
నిందితుల్లో ఒకరైన బాలయ్య గతంలో అటవీ ప్రాంతంలో వాచర్ గా పని చేసిన అనుభవంతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని సమాచారం. ఈ నిందితులు అడవిలో కలప దుంగలను దొంగతనం చేసి.. ఎడ్లబండిపై నర్సింలు ఇంటికి తీసుకొస్తుంటారని, అతడు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటాడని తెలుస్తోంది. కుమారుడు అటవీ అధికారిగా పనిచేస్తుంటే.. తండ్రి కలప దొంగతనం చేస్తున్నాడనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఈఘటన కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.