ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు మించి విలువైనది మరొకటి ఉండదు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో అమ్మనాన్నలకి మించిన వారు ఉండరు. వారు ఎన్నో కష్టాలు పడుతూ, సకల సుఖాలు వద్దులుకోని బిడ్డల ఆనందం కోసమే తాపత్రయ పడుతుంటారు. తాము పస్తులు ఉంటూ బిడ్డలకు కడుపు నిండా అన్నం పెడుతుంటారు. ఇలా తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి 30 ఏళ్లు సింగరేణిలో పనిచేసి కుమారుడి కోసం ముందస్తు పదవీ విరమణ చేశారు. వారసత్వం కింద కుమారుడికి ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు వారు వృద్ధాప్యంలోకి వచ్చాక ఆ పుత్రుడు పట్టించుకోవడం లేదు. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావు గ్రామానికి చెందిన గందె వెంటయ్య, లక్ష్మి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వెంకటయ్య సింగరేణిలో పని చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. రేయింబవళ్లు కష్టపడి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమిని కొన్నారు. వెంకటయ్య సింగరేణిలో 30 ఏళ్ల పాటు పనిచేసి.. ముందస్తు పదవి విరమణ చేశారు. వారసత్వంగా వస్తున్న ఉద్యోగాన్ని కుమారుడు రవికి కట్టబెట్టారు. అలానే తాను సంపాదించిన ఆస్తిని కుమారుడికి ఇచ్చారు. ఇలా తండ్రి నుంచి ఆస్తులు,ఉద్యోగం తీసుకున్న రవి.. వారు వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత చూసుకోవడం లేదు. వెంకటయ్య భార్య లక్ష్మీకి ఇటీవల గుండెకు ఆపరేషన్ చేశారు. ఈ చికిత్స కోసం వెంకటయ్య రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. భార్య కోసం ఖర్చు చేసిన డబ్బులును ఇతరు నుంచి అప్పుగా తీసుకున్నారు. ఈ క్రమంలో తాను చేసిన ఈ అప్పులను తీర్చమని కుమారుడు రవికి వెంకటయ్య తెలిపాడు.
అప్పులు తీర్చమన్నందుకు కుమారుడు తండ్రిని దుర్భాషలాడుతూ కొట్టి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. చేసేది ఏమిలేక ఆ వృద్ధ దంపతులు కాజీపేటలో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. తమ కొడుకులో మార్పు తీసుకొచ్చి.. మంచిగా చూసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజావాణీ పాలనాధికారి సిక్తా పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. వారి సమస్యపై స్పందించిన కలెక్టర్.. వెంటనే ఆ వృద్దుల కు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. చూశారా.. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఎక్కువ కాలేదు, వారి ఉద్యోగం ఎక్కువ కాలేదు.. కానీ తల్లిదండ్రులను పోషించడం మాత్రం భారంగా భావిస్తున్నారు కొందరు పుత్ర ‘రత్నాలు’. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.