ఈ మధ్యకాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతున్నారు. సర్ధుకుపోయే గుణం లేకపోవడం వలన వచ్చే ఈ గొడవలతో ఎన్ని జీవితాలు నాశనమవుతున్నాయి. మరీ దారుణం ఏమిటంటే.. పెళ్లిళ్లలో భోజనాల వద్ద కూడా గొడవలు జరుగుతున్నాయి. తమకు సరిగ్గ మర్యాదలు చేయలేదంటూ వాదనకు దిగి.. ఒకరిపై మరొకరు వాదనకు దాడులు చేసుకుంటున్నారు. హాయిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వరుడు వధువులు పెళ్లిని రద్దు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. తాజాగా చికెన్ ముక్క ఓ పెళ్లి విందులో ఉద్రిక్తతకు దారి తీసింది. చికెన్ తో భోజనం పెట్టలేదని వరుడి ఫ్రెండ్స్ పెళ్లి కూతురి తరపు బంధువులతో లొల్లికి దిగారు. దీంతో అక్కడ చినికి చినికి గాలి వానలా మారి పెద్ద రచ్చ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని జగద్గిరి గుట్ట ప్రాంతానికి చెందిన అబ్బాయికి, కుత్బుల్లాపూర్ కు చెందిన అమ్మాయితో కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. ఇరుకుటుంబాల వారు పెళ్లి పనులు ఫుల్ బిజీగా ఉన్నారు. సోమవారం వారి వివాహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వధువు కుటుంబ సభ్యులు వివాహం విందులో శాకాహారం వడ్డించారు. అదే సమయంలో భోజనాలకు సిద్ధమైన వరుడి స్నేహితులు.. ఆ విందు చూసి అసహనం వ్యక్తం చేశారు. తమకు చికెన్ కావాలని గొడవకు దిగారు. ఈక్రమంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంలో వరుడి తరుపు పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఈక్రమంలో ఒకర్ని మరొకరు చేతులతో నెట్టుకున్నారు. చికెన్ తో మొదలైన చిన్న గొడవ..పెద్దగా మారింది. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసింది.
పరిస్థితి చేయిదాటిపోయి.. ఏకంగా వధువు, వరుడు కుటుంబ సభ్యులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దీంతో ఈ గొడవ కాస్తా పెళ్లిని పెటాకులు చేసింది. చివరకు ఈ గొడవ కారణంగా వివాహం రద్దయింది. ఇలా పెళ్లి వారి కంటే.. పెళ్లికి వచ్చే బంధువుల కారణంగా ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. చికెన్ ముక్కలేదని, పప్పు సరిపోలేదని, ఏసీ బస్సు పెట్టలేదని.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి…నూతన జంటలను విడగొడుతున్నారు. మరికొన్ని సంఘటనలు అయితే ఏకంగా నూతన దంపతులను కోర్టు మెట్లు ఎక్కించేలా చేస్తాయి. తాజాగా చికెన్ కోసం పెళ్లి ఆగిపోవడం పట్ల స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఇక ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది