పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెట్టాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలను ఇంటి ముందు నిర్లక్ష్యంగా వదిలేసి వారి పనుల్లో మునిగిపోతారు. దీంతో అనుకోని ఆపదలు ఎదురవుతుంటాయి. అలా కొందరు పిల్లలు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులలో పడి మరణిస్తున్నారు. మరికొందరు పసిపిల్లల వాహనాలు కింద పడి మృత్యువాత పడుతున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 15 నెలల బాబుపైకి కారు దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో రిహన్ అనే 15 నెలల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి బయటకు వెళ్లేందు కారును స్టార్ చేశాడు. ఈక్రమంలో రిహాన్ ఆడుకుంటూ… కారు ముందుకి వెళ్లాడు. ఆ చిన్నారిని గమనించని డ్రైవర్ కారుని ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడిపై నుంచి కారు వెళ్లింది. రోడ్డుపై పడి ఉన్న బిడ్డను గమనించిన తల్లి వెంటనే పరుగెత్తుకొచ్చి..చిన్నారిని ఆస్పత్రికి తరలించింది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చికిత్స అందించిన వైద్యులు బాలుడికి ప్రాణాపాయం లేదని తెలిపారు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.