ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. అయితే ఇదే పని మస్కట్ లో చేస్తే.. ఎక్కువ డబ్బులు ఇస్తారని.. అక్కడ పని మనుషులకు చాలా డిమాండ్ ఉంటుందని చెప్పిన మాటలు నమ్మింది. కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలంటే.. మస్కట్ కు వెళ్లడం ఒక్కటే దారి అని భావించింది. మస్కట్‌లో పని అంటే.. మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. అక్కడ తాను అనుభవించిన చిత్రవధను వీడియో ద్వారా కుటుంబంతో పంచుకుంది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇది కూడా చదవండి : శాడిస్ట్ ప్రియుడు.. ప్రియురాలిపై స్నేహితులతో అత్యాచారం
ఆదిలాబాద్‌కు చెందిన అర్జున్, లక్ష్మి బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్ట ణానికి వలస వచ్చారు. లక్ష్మి స్ధానికంగా ఉన్న ఇళ్లలో పనిచేసేది. నిజామాబాద్‌కు చెందిన సల్మా అనే ఏజెంట్ మస్కట్‌లో మంచి పని ఉందని మంచి జీతం ఇస్తారని లక్ష్మికి మాయమాటలు చెప్పింది. సల్మా మాటలను నమ్మిన లక్ష్మి అందుకు ఒప్పుకుంది.
మంచి జీతం ఇస్తారు కదా.. తమ కుటుంబం బాగుపడుతుందనే ఆశతో మస్కట్‌కు వెళ్లింది. అయితే ఆమె ఆశలు అడియాశలు అవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు. తనను రెండు నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని తాను పడుతున్న బాధను వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. ఏజెంట్ సల్మా తనను విక్రయించిందని కుటుంబ సభ్యులకు చెప్పింది లక్ష్మి. దీంతో కుటుంబ సభ్యులు ఆర్మూర్ పోలీసు స్టేషన్‌లో ఏజెంట్ సల్మాపై ఫిర్యాదు చేశారు. ఆమెను ఇండియా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. ఈ మేరకు పిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.