నేటికాలంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. రక్తసంబంధాలకు విలువ లేకుండా పోతుంది. ప్రతి తల్లిదండ్రులు కూతురి పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తుంటారు. కానీ కొందరు తండ్రులు మాత్రం తాము చెప్పిందే జరగాలని మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో తమ మాట నెగ్గకుంటే సొంత వారిని సైతం హతమార్చడానికి వెనుకాడటం లేదు. తాజాగా కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మహబూబ్ నగర్ జిల్లా జైనల్లిపూర్ గ్రామానికి చెందిన దయల్ల కృష్ణయ్య, కలమ్మ దంపతులు ఉన్నారు. వీరికి సరస్వతి(23)అనే అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. మే8వ తేదీన కూతురు సరస్వతికి వివాహం జరిగింది. అయితే ఆ పెళ్లి సరస్వతికి ఇష్టంలేదని సమాచారం. ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లాల్సి ఉంది. కాపురానికి వెళ్లనని తండ్రితో సరస్వతి చెప్పింది. కలమ్మ కూడా సరస్వతికి మద్దతు ఇచ్చింది. దీంతో ఇద్దరితో గొడవకు దిగాడు కృష్ణయ్య. ముగ్గురి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో ఎంత చెప్పినా తన మాట వినకపోయేసరికి సహనం కోల్పోయిన కృష్ణయ్య కర్రతో సరస్వతి, కలమ్మపై తీవ్రంగా కొట్టాడు. అనంతరం తాను విషగుళికలు మింగి కుమారుడికి ఫోన్ చేశాడు. పొలం వద్ద ఉన్న కుమారుడు హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు.
ఇదీ చదవండి: భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన సాఫ్ట్ వేర్ భర్త!
తలుపులు పగులగొట్టి చూడగా, సరస్వతి, కలమ్మ కొన ఊపిరితో ఉన్నారు. ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తల్లి కూతురు మరణించారు. హాస్పిటల్లో కృష్ణయ్య చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నిందితుడు కృష్ణయ్యపై కేసు నమోదు చేసినట్లు మహబూబ్‌నగర్ రూరల్ సిఐ మహేశ్వర రావు తెలిపారు. అయితే నిందితుడికి తాగుడు అలవాటు లేదని పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.