ప్రజలకు రక్షణగా ఉంటూ, సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలపాలను అరికట్టడటంలో పోలీసులు కీలక పాత్ర వహిస్తారు. అందుకే పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు అపారమైన గౌరవం ఉంటుంది. ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో ఎందరో పోలీసులు అమరులైనారు. ఇలా నిత్యం ప్రజలక కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోలీస్ వ్యవస్థకు కొందరు అపకీర్తి తెచ్చిపెడుతున్నారు. కొందరు పోలీసులు ప్రజలను లంచాలతో వేధించడం, ఆడవారిని లైంగికగా వేధింపులకు గురిచేసిన ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ఖైదీ సోదరిని వీడియో కాల్ చేయాలంటూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ బాషా అనే ఖైదీ చర్లపల్లి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు బయటకు వచ్చేందుకు పెరోలో అవకాశం లభించింది. అయితే ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ ఆ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ఖైదీ సోదరికి ఫోన్ చేసి వేధిండం మొదలు పెట్టాడు. ఈ విషయాన్ని సదరు మహిళ జైల్లో ఉన్న తన సోదరుడికి చెప్పుకొని విలపించింది. తన కుటుంబ సభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడని ఆ జైలు పర్యవేక్షణాధికారి సంతోష్ రాయ్ కి ఆ ఖైదీ గత నెల 26న ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు స్వీకరించిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం వరకు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఈక్రమంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ములాఖత్ కు వచ్చే ఖైదీల భార్యలను,సోదరీమణులను లైంగికంగా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదులు అందాయి. అయితే బాషా సోదరి చేసిన ఫిర్యాదు పై అధికారులు చర్యలు చేపట్టారు. వేధింపులు వాస్తవమేనని విచారణాధికారి నివేదిక అందిచారు. ఈ నేపథ్యంలో చింతల దశరథంపై శాఖాపరమైన తీసుకున్నారు. ఆయనను బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.