నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు మద్యం తాగి.. అతివేగంగా డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గతంలో పంజాగుట్ట ప్రాంతంలో రమ్య అనే చిన్నారి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అంతేకాక గచ్చిబౌలి ప్రాంతంలో రోడ్డుపై కూలీ పనులు చేసుకుంటున్న ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకున్నారు. అంతేకాక ఇటీవలే మైనర్లు అతివేగంగా బైక్ నడిపి.. ఓ బాలుడి మృతికి కారణం అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని వనస్థలిపురం ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున ఓ కారు బీభత్సం సృష్టించింది. వనస్థలిపురంలోని ఎన్టీవో కాలనీ ప్రాంతంలో మంగళవారం కొందరు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. అది గమనించిన వాకర్స్ వెంటనే పక్కకు తప్పుకోవడం తో ఘోర ప్రమాదం తప్పింది. అయితే కారును యువకులు డ్రైవింగ్ చేస్తున్నారని , వారు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. వేగంగా వచ్చిన ఆ కారు ఓ షాపును ఢీకొట్టి ఆగిపోయింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే ఆ యువకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో కారు 180 స్పీడ్ తో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అయితే ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతినగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా మద్యం తాగి వాహనాలను నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.