తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ కన్నుమూశారు. ఆయన మృతికి న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రముఖ న్యాయ కోవిదుడు, తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ (63) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేరళ కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. సొంత రాష్ట్రం కేరళ హైకోర్టు జడ్జిగా, అలాగే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు (హైదరాబాద్ హైకోర్టు), ఆపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేశారు రాధాకృష్ణన్.
కేరళ హైకోర్టు జడ్జిగా 2004 నుంచి 2017 వరకు సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించారు రాధాకృష్ణన్. తద్వారా శాశ్వత న్యాయమూర్తి హోదా దక్కించుకున్నారు. ఆ టైమ్‌లోనే రెండుసార్లు తాత్కాలిక సీజేగానూ కేరళ హైకోర్టులో బాధ్యతలు నిర్వహించారు. ఆపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు సీజేగా వెళ్లారు. అటుపై బదిలీ మీద హైదరాబాద్ హైకోర్టు (తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు)కు ప్రధాన న్యాయమూర్తిగా విచ్చేశారు. ఇక, అడ్వకేట్ దంపతులు భాస్కరన్ నాయర్, పారుకుట్టి అమ్మ దంపతులకు కొల్లాంలో పుట్టారు రాధాకృష్ణన్. కోలార్ కేజీఎఫ్ లా కళాశాల నుంచి ఆయన లా డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1983లో తిరువనంతపురం కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు రాధాకృష్ణన్. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గానూ పని చేశారాయన. రాధాకృష్ణన్ భార్య పేరు మీర్యాసేన్. వీరికి పార్వతీ నాయర్, కేశవ్రాజ్ నాయర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Justice TB Radhakrishnan Passes Away. He has served as the Chief Justice of Calcutta, Telangana, Hyderabad and Chhattisgarh High Court.#JusticeTBRadhakrishnan pic.twitter.com/65aseXTijO
— The Court & Law (@TheCourtAndLaw) April 3, 2023