దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయం చూసి ఒకేసారి పదిహేను ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారు, వెండి వంటి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు కూడా దోచుకెళ్లారు.
తెలంగాణలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయం చూసి ఒకేసారి పదిహేను ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.. ఆదివారం రోజున సింగారం గ్రామం సమీపంలోని బేగంపేట, జాల గ్రామాల్లో దుర్గమ్మ పండుగ నిర్వహించారు. ఈ క్రమంలో సింగారం గ్రామంలోని పలువురికి పండుగకు హాజరవ్వాలంటూ ఆహ్వానం అందింది. దీంతో పలువురు గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి బేగంపేట, జాల గ్రామాల్లో ఉన్న బంధువులు ఇళ్లకు వెళ్లారు.
ఈ విషయం పసిగట్టిన దొంగలు చెలరేగిపోయారు. ఈ సమయాన్ని అదునుగా భావించి తాళాలు వేసిన ఇండ్లను చోరీ చేశారు. ఏకంగా 15 ఇళ్ల తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. పలు ఇళ్లలో బంగారు, వెండి వంటి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు కూడా దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. పండుగ నుండి ఉదయాన్నే ఇంటికి వచ్చే సరికి ఇళ్లలో వస్తువులు చిందరవందరగా పడివున్నాయి. ఇది దొంగలు పనే అని నిర్ధారించుకొన్న గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామమంతటా..’మా ఇంట్లో దొంగతనం జరిగిందంటే.. మా ఇంట్లోనూ జరిగింది..’ అంటూ చెప్పుకుంటున్నారు. ఇకపై పండగలొచ్చినా, చావు వార్తలోచ్చినా ఎటూ పోము అని చెప్తున్నారు. ఫిర్యాదులు అందుకున్న రాజపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వారే అని చెప్తున్నారు. ఒకవేళ మీరూ ఎప్పుడైనా ఇలా ఇళ్లు విడిచి వెళ్లాల్సిన అవసరం వస్తే కాస్త జాగ్రత్త పడండి.