హార్ట్ ఎటాక్ .. దీని పేరు వింటుంటేనే గుండె ఝల్లుమంటోంది. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో దీని కారణంగా అనేక మంది చనిపోతున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మొదలు.. ఈ రోజు కానిస్టేబుల్ మరణం వరకు అందరూ దీని బారిన పడ్డవారే. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో గుండె పోటు మరణాలు కలవర పాటుకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. చూస్తూ చూస్తుండగానే గుండెపోటుతో మనుషులు కుప్పకూలిపోతున్నారు. రెప్పపాటులో కన్నుమూస్తున్నారు. దేశంలోనే కాదూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయి. కుప్పంలో నారా లోకేష్ ప్రచారానికి వెళ్లి ఒక్కసారిగా నేలకొరిగాడు నటుడు తారకరత్న. గుండెపోటుకు గురై.. 23 రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్నటికి నిన్న పాతబస్తీలోని ఓ వివాహానికి హాజరై..పెళ్లి కుమారుడ్ని చేస్తూ ఓ వ్యక్తి ఉన్నపళంగా పడిపోయాడు. నేడు కిషన్ రెడ్డి అల్లుడు సైతం కార్డియాక్ అరెస్టుతో చనిపోయారు. జిమ్ చేసేందుకు వెళ్లి ఓ కానిస్టేబుల్ మృత్యు ఒడికి చేరుకున్నాడు. తాజాగా మరో ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.
ఆ ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకాయి. వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు వధువు తల్లిదండ్రులు. మరో కొన్ని గంటల్లో పెళ్లి అనగా వరుడు ఇంట్లో విషాదం నెలకొంది. వరుడు తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరట్లలో జరిగింది. దీంతో ఘనంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన కూసరి గంగారాం-రాజేశ్వరి కుమారుడికి.. మల్లాపూర్ మండలం కొత్త దామ్ రాజ్ పల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి కావడంతో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వధువు తల్లిదండ్రులు. అటు వరుడి ఇంట్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. ఇక పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లడమే తరువాయి.
అయితే పంతులు కొంచెం లేటుగా వస్తారన్న సమాచారంతో కాసేపు ఆగారు. అంతలో పాల ప్యాకెట్లకు బయటకు వెళ్లి వచ్చాడు వరుడు తండ్రి గంగారాం. వాటిని తీసుకు వచ్చి కుర్చీలో కూర్చున్నవాడూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే సరికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదం నెలకొంది. ఈ వార్త వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది. ఈ మరణ వార్త ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరుడు బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెప్ప పాటులో జరుగుతున్న ఈ మరణాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇలాంటి మరణాలకు కారణమేమిటనీ భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.