గత వారం రోజుల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు విల విలలాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోడ్లపై ప్రజలు లేక నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి.
రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం 10 గంటల నుండే ఎండకు మాడు పగిలిపోతుంది. భానుడి ప్రతాపంతో జనం బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నాం పూట ఎండకు వడగాల్పులు కూడా తోడై ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది చాలా మంది వడదెబ్బతో అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలైనారు. వడదెబ్బతో 12 మంది చనిపోయారని కూడా సమాచారం ఉంది. కొన్ని చోట్ల పగటిపూట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల గరిష్టంగా కూడా నమోదైంది. ఎండలకు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
చల్లని మజ్జిగ, పానీయాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచనలు కూడా చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహాలు సూచించింది. ఇలంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలకు ఊరట కలిగించే కబురు చెప్పింది. తెలంగాణలో పలు ప్రాంతాలలో వర్ష సూచన ఉన్నట్లు సమాచారం అందించింది. నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లుండి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గత మూడు నాలుగు రోజుల నుంచి భగ్గుమంటున్న ఎండల నుంచి ఉపశమనం దొరికే కబురు వచ్చినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.