హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌సీయూ) ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్ధి సంఘాల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యూనివర్సిటీ క్యాంపస్ లో బీబీసీ ప్రసారం చేసిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. వందమంది పోలీసుల మధ్య డాక్యుమెంటరీని ప్రదర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం స్క్రీనింగ్ నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐకి మెయిల్ చేసింది. అయినా గానీ ఎస్ఎఫ్ఐ పట్టుబట్టి మరీ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
యూనివర్సిటీ యాజమాన్యం లెఫ్ట్ యూనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. భారత ప్రభుత్వం నిషేధించిన డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రదర్శించడం సరికాదంటూ ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇండియా: ది మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీకి పోటీగా.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను యూనివర్సిటీ నార్త్ బ్లాక్ లో ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిషేధించిన డాక్యుమెంటరీని యూనివర్సిటీలో ప్రదర్శించినందుకు.. రికార్డు చేసిన వీడియోలను కేంద్రానికి మెయిల్ ద్వారా పంపించి.. యూనివర్సిటీ మీద, ఎస్ఎఫ్ఐ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు తెలిపారు.
అయితే డాక్యుమెంటరీని సోషల్ మీడియాలో మాత్రమే నిషేధించారని.. బహిరంగ ప్రదేశంలో కాదని ఎస్ఎఫ్ఐ తెలిపింది. అటు ఏబీవీపీ, ఇటు ఎస్ఎఫ్ఐ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. వందమంది పోలీసుల మధ్య స్క్రీనింగ్ జరుగగా.. ఇంటిలిజెన్స్ కూడా నిఘా ఉంచింది. ప్రదర్శన ప్రశాంతంగా ముగిసినా గానీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమో అన్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయానికి ఈ ఉద్రిక్త వాతావరణం సద్దుమణుగుతుందని పోలీసులు, యూనివర్సిటీ యాజమాన్యం భావిస్తుంది.