కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గినట్టే తగ్గి ఆపై మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరగటంతో రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ దిశగా అడుగులు వేశాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా రాష్ట్రాలన్నీ అమల్లోకి తీసుకొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే కేసులు క్రమక్రమంగా తగ్గుతూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక కరోనా కేసులు తగ్గటంతో మెల్లమెల్లగా రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ ఎత్తివేశాయి. వ్యాపార సముదాయాలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్క్‌లు వంటివి వాటిని తెరుచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. ఇక తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపేటలో పది రోజుల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు గ్రామ అధికారులు. నేటి నుంచి ఈ నెల 27 వరకు లాక్‌డౌన్ ఉండనుందని గ్రామ సర్పంచ్ తెలియజేశారు. కాగా ఈ లాక్‌డౌన్‌లో ప్రతీ ఒక్కరు సహకరించాలని తెలిపారు. నిత్యవసర సరుకుల కొరకు ఉదయం 6-10 వరకు వెసులుబాటను కల్పించామని అధికారులు చెప్పారు.