యూట్యూబర్ శ్రీ అలియాస్ సురేష్.. గత వారం రోజులుగా ఇతడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. కారణం.. వివాహ సందర్భంగా అతడికి వచ్చిన కట్నాలు. డిసెంబర్ 4న శ్రీ వివాహం జరిగింది. పెళ్లి వీడియో తన చానెల్‌లో పోస్ట్ చేసిన శ్రీ.. సబ్‌స్క్రైబర్స్‌ని కట్నాలు పంపమని అడిగాడు. ఆ మొత్తం ఏకంగా 4 కోట్ల రూపాయలపై చిలుకు అయ్యిందని తన చానెల్‌లో పోస్ట్ చేశాడు. దాంతో.. యూట్యబర్ పెళ్లికి.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు కట్నాలు పంపిన సబ్‌స్క్రైబర్లు.. అంటూ సోషల్ మీడియాలో వైరలయ్యింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. శ్రీ తనకు అందిన కట్నాలు నాలుగు కోట్ల రూపాయల పైచిలుకు అన్నది డబ్బు గురించే. కానీ ఆ మొత్తం అతడికి నిజంగా డబ్బు రూపంలో ఇవ్వలేదు.
పెళ్లి వీడియో పోస్ట్ చేసిన సందర్భంగా శ్రీ.. సబ్‌స్క్రైబర్స్ తన వివాహానికి నిజంగా హజరైతే.. లేదా.. తన పెళ్లి సందర్భంగా ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో.. ఆ మొత్తాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయమని కోరాడు. అలా కామెంట్స్ చేసిన మొత్తాన్ని కౌంట్ చేసి.. 4 కోట్ల రూపాయలకు పైగా కట్నం వచ్చింది అని తన చానెల్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ మొత్తం నిజంగా డబ్బులే అనుకోవడంతో అతడి పోస్ట్ వైరలయ్యింది.
ఇదిలా ఉండగా.. తాజాగా శ్రీ.. నిజంగానే తన సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులు అడిగాడు.. అది కూడా అతడి చిరకాల కల సాకారం చేసుకోవడం కోసం. ఇతడి చానెల్ ఫాలో అయ్యేవారికి శ్రీ.. కల ఏంటో బాగా తెలుసు. దర్శకుడిగా మారి సినిమా తీయాలనేది అతడి కోరిక. ఈ విషయాన్ని గతంలో అనేక సార్లు.. తన వీడియోల్లో చెప్పుకొచ్చాడు. అయితే అది కూడా సబ్‌స్క్రైబర్స్ మద్దతుతోనే సినిమా తీస్తానని అనేక సందర్భాల్లో.. చెప్పుకొచ్చిన శ్రీ.. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో దాని గురించి అప్‌డేట్ ఇచ్చాడు. త్వరలోనే తాను సినిమా డైరెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పిన శ్రీ.. సబ్‌స్క్రైబర్స్ మద్దతుతోనే.. అంటే వారు చేసే ఆర్థిక సాయంతోనే సినిమా తీయాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు.
వివాహం సందర్భంగా తనకు ఎంత కట్నం.. ఇవ్వాలనో భావిస్తున్నారో ఆ మొత్తాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయమని కోరాడు. ఇప్పుడు తాజాగా.. కామెంట్స్‌లో చెప్పిన మొత్తాన్ని లేదా.. తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తే.. అలా వచ్చే మొత్తంతో తాను సినిమా తీస్తానని అన్నాడు శ్రీ. సబ్‌స్క్రైబర్స్ పంపే డబ్బుని తాను కేవలం సినిమా తీయడం కోసమే మాత్రమే వినియోగిస్తానని.. దుర్వినియోగం చేయనని చెప్పాడు. ఇందుకు సంబంధించి త్వరలోనే మరో అప్‌డేట్ ఇస్తానని వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక శ్రీ వీడియోపై మిశ్రమాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది సబ్‌స్క్రైబర్లు.. శ్రీ ఆలోచనను ప్రశంసించడమే కాక.. అతడికి మద్దతిస్తామని.. సాయం చేస్తామని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. సినిమా తీయాలనేది నీ కల. నువ్వు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఆ కల నేరవేర్చుకోవడం నీ బాధ్యత. అంతే తప్ప.. నీకున్న ఫేమ్, క్రేజ్‌ను వాడుకుని.. ఇలా సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా తీయడం కోసం సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులడిగిన శ్రీ ఆలోచన సరైందేనని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.