విదేశంలో మరో తెలుగు విద్యార్ధి బలయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లిన యువకుడు డాక్టర్‌గా తిరిగొస్తాడనుకుంటే విగతజీవిగా తిరిగొస్తున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఉన్నత విద్య కోసమని ఫిలిప్పీన్స్ దేశం వెళ్లిన తెలుగు వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మణికాంత్ రెడ్డి (21) యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు. 2020లో ఫిలిప్పీన్స్ లోని దావో మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ లో చేరాడు. కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు ఆన్ లైన్ లో క్లాసులు విన్నాడు. గత ఏడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ వెళ్ళాడు మణికాంత్. అక్కడే హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు. ప్రస్తుతం మూడవ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ మేనేజర్ మణికాంత్ తండ్రికి ఫోన్ చేసి మీ కొడుకు బైక్ ప్రమాదంలో చనిపోయాడని అన్నాడు. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మెట్లపై నుంచి జారి పడి మృతి చెందాడని చెప్పారు.
దీంతో మణికాంత్ తండ్రికి ఏమీ అర్థం కాలేదు. తన కొడుకు చనిపోవడమేంటని మొదట నమ్మలేదు. అయితే హాస్టల్ మేనేజర్. మణికాంత్ రెడ్డి మృతదేహం ఫోటోను, వీడియోను పంపించడంతో మణికాంత్ తండ్రి హృదయం బద్దలయినంత పనయ్యింది. ఇదిలా ఉంటే హాస్టల్ వెనుక డ్రైనేజీ కాలువలో మణికాంత్ రెడ్డి మృతదేహం కనిపించిందని అక్కడి పోలీసులు వెల్లడించారు. హాస్టల్ యాజమాన్యం చెబుతున్న దానికి, పోలీసులు చెప్తున్న దానికి పొంతన లేకపోవడంతో మణికాంత్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. 11 గంటల సమయంలో మణికాంత్ రెడ్డి డ్రైనేజీ కాలువలో విగతజీవిగా పడున్నాడు. తల వెనుక గాయాలు ఉన్నాయి. ఎవరైనా కొట్టి కాలువలో పడేశారా? లేక బైక్ పై వెళ్తుంటే అదుపుతప్పి కాలువలో పడ్డాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం మన దేశానికి చెందిన విద్యార్థులకు, మణికాంత్ రెడ్డికి హాస్టల్ లో గొడవ జరిగిందని హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు చెబుతున్నారు. ఈ గొడవ కారణంగా ఎవరైనా మణికాంత్ ని హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొడుకు మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా తిరిగొస్తాడనుకుంటే మృతదేహంగా తిరిగొస్తుండడంతో కన్నవాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. 4 రోజుల కిందటే తన కొడుకుతో ఫోన్ లో మాట్లాడామని, హాస్టల్ ఫీజు కట్టాలంటే కూడా పంపించామని మృతుడి తండ్రి అన్నారు. ‘నాన్న పరీక్షలు నడుస్తున్నాయి, నేనే మీతో మాట్లాడతా’ అని అన్నాడని.. శనివారం ఫోన్ చేస్తే కలవలేదని.. ఆదివారం చేద్దామనుకునేలోపే ఈ ఘోరం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కొడుకు లేకుండా మేమెలా బతికేది అంటూ మణికాంత్ తండ్రి బోరున విలపిస్తున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు, బంధువులు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఫిలిప్పీన్స్ లో ఎంబసీతో పాటు, అక్కడి ఎన్నారైలతో మాట్లాడి మణికాంత్ మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.