నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సులర్ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అమ్మాయిల హాస్టల్ కి వెళ్లి.. అక్కడ విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు. అమ్మాయిలతో ఆయన చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు మరొ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో వీసీ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ లోకి ప్రవేశంపై నిషేధం ఉంటే వీసీ ఎలా వెళ్తారంటూ కొందరు విద్యార్ధి నాయకులు ప్రశ్నించారు. గేటు ఓపెన్ చేయించి రాత్రి సమయంలో ఆడపిల్ల హాస్టల్ కు వెళ్లడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీసీకి అంతగా డ్యాన్స్ చేయాలనుకుంటే అబ్బాయిల హాస్టల్ కు వెళ్లాలి గానీ రాత్రి పూట అమ్మాయిల హాస్టల్ కి వెళ్లండం ఏంటని ప్రశ్నించారు. అనేక ఆరోపణలు వస్తున్నా అతనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్ట్రార్ల తొలగింపు వరకూ ఏదో లొల్లి జరుగుతూనే ఉంది. వర్సిటీ అభివృద్ధిపై కాక వసూళ్లపైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయి. ప్రస్తుతం వీసీకి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.