విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. మొదట్లో చెప్పినట్లుగానే ఇంటర్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే పదో తరగతి రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 86.60 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53 శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68 శాతంగా నమోదైంది.
తెలంగాణలో 2022-23 అకాడమిక్ ఇయర్ లో పదో తరగతి పరీక్షలకు మొత్తం 4,84,620 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వారిలో 86.60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక గతంలో లాగానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 2793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూల్స్‌లో ‘సున్నా’ శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లాలో 99 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీగా వ్యవహరించారు.