మాంసాహార ప్రియులకు నాన్ వెజ్ లేకుంటే.. ముద్ద కూడా దిగదు. కొంత మంది నాన్ వెజ్ పిచ్చోళ్లు.. రోజు పెట్టిన తింటారు. ఇక నెల చివరిలో అయితే బడ్జెట్ లేక గుడ్డుతోనైనా సరిపెట్టేసుకుంటారు. ఇక ఆదివారమైతే చెప్పనక్కర్లేదు. అటువంటి వారి కోసమే తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
మాంసం ముక్క లేందే ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులకు. కొంత మందైతే రోజు వండాలే కానీ లొట్టలేసుకుని తింటారు. ఆ రోజు ఈ రోజు అని నియమాలేమీ పెట్టుకోని వారైతే.. ఎప్పుడు తినాలపిస్తే అప్పుడు చికెన్, మటన్ తెచ్చుకుని వండుకుని తింటారు. ఇవి అందుబాటులో లేకపోతే గుడ్డుతోనైనా సరిపెట్టేసుకుంటారు. ఇక ఆదివారమైతే చెప్పనక్కర్లేదు. ఈదేవీ, పాకేవీ, ఎగిరేవీ వేటిని వదిలి పెట్టరు నాన్ వెజ్ ప్రియులు. అలాంటి మాంసాహార ప్రియులకు తెలంగాణ సర్కార్ ఓ తీపి కబురు చెప్పింది. ఇంతకూ ఆ శుభవార్త ఏంటనుకుంటున్నారా..?
కేవలం మటన్‌తో చేసే వంటలతో కూడిన క్యాంటీన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురానుంది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. మాంసం ఉత్పత్తులు, వాటిని తినడం వల్ల లభించే పోషకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మటన్ క్యాంటీన్ల ఏర్పాటుపై రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీతో చర్చించారు. అనంతరం మటన్ క్యాంటీన్ల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ కూడా అంగీకారం తెలిపింది.
రాష్ట్రంలో తొలి మటన్ క్యాంటీన్‌ను హైదరాబాద్ శాంతినగర్ కాలనీలో కో ఆపరేటివ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంటీన్లలో మటన్ బిర్యానీతో పాటు పాయ, కీమా, పత్తార్ కా గోస్ట్, గుర్ధా ప్రై వంటి రుచికరమైన వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ క్యాంటీన్ మార్చిలో ప్రారంభం కానుంది. మటన్ క్యాంటీన్లలో మెనూ ధరలు ఇంకా రూపొందించలేదని సమాచారం. అయితే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో ఈ క్యాంటీన్లు విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తున్న సంగతి విదితమే. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఫిష్ క్యాంటీన్లలో ప్రస్తుతం ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వెరైటీ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఫిష్ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తుండటంతో.. మటన్ క్యాంటీన్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే ఇటువంటి క్యాంటీన్లను నడపడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.