సమాజంలో గుర్తిం పున్న ఉద్యోగం.. ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం.. యూనిఫాం కొలువు కావడంతో యువతలో క్రేజ్.. ఈ కారణాలే పోలీస్ కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అందుకే 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో SI పోస్టుకు 446 మంది పోటీలో ఉన్నట్లు లెక్క. ఇలాంటి సమయంలో కీలకమైన ప్రాథమిక రాత పరీక్ష ఈనెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఆదివారం నిర్వహించనున్న ఈ పరీక్షకు హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ గడువు ముగిసింది.
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే -మార్కులను తొలిసారిగా కుదించారు. క్రితం సారి పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా ఈ మార్కులుండేవి. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలుం టాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే. అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాల్ని గుర్తించగలిగితే చాలు.
మరోవైపు.. ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది. 5 తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. అందుకే తొలుత సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలపైనే దృష్టిపెట్టాలి. పరీక్షలో ‘సరైన 60 జవాబులను పక్కాగా గుర్తించగలిగితే క్వాలిఫై అవ్వొచ్చు. తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే నెగెటివ్ మార్కులతో మొదటికే మోసం రావచ్చు. ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి.